ప్రేమజంట ఆత్మహత్యాయత్నం

సత్యనారాయణపురం(విజయవాడ సెంట్రల్‌): 'ఒకరిని వదిలి ఒకరు ఉండలేనంతగా ప్రేమించుకున్నాం.. మా పెళ్లిని సమాజం హర్షించదు. కలసి బతకలేం.. విడిచి ఉండలేం..' అని ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్న ఘటన గాంధీనగర్‌లోని ఓ హోటల్‌లో చోటుచేసుకుంది. ఘటనలో యువతి మృతి చెందగా.. యువకుడు ప్రాణపాయం నుంచి తప్పించుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. గన్నవరం మండలం తెంపల్లికి చెందిన నాగబోయిన గౌతమి (28), వెంట్రప్రగడకు చెందిన లోకేశ్‌(19) ఇద్దరు సుమారు రెండు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. గౌతమి అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తుండగా, లోకేశ్‌ పాలిటెక్నిక్‌ చదువుతున్నాడు. ఇద్దరి మధ్య వయసు తేడా ఉన్నా ప్రేమించుకున్నారు.


ఇదిలా ఉండగా క్రిస్మస్‌కి దుస్తులు కోసమని చెప్పి గురువారం ఉదయం గాంధీనగర్‌లో ఒక హోటల్‌లో రూం తీసుకున్నారు. సాయంత్రం 4 గంటల సమయంలో షాపింగ్‌ వెళతామని హోటల్‌ నిర్వాహకులకు చెప్పి ఆ సమయంలో కాలింగ్‌ బెల్‌ పెట్టాలని కోరారు. రాత్రి అయినా వారు గదిలో నుంచి బయటికి రాకపోవడంతో నిర్వాహకులు అనుమానంతో సత్యనారాయణపురం పోలీసులకు సమాచారం అందించారు. సీఐ బాలమురళీకృష్ణ, ఎస్‌ఐలు సత్యనారాయణ, విమల ఘటనా స్థలానికి చేరుకుని తలుపులు బద్దలకొట్టారు. లోపల వారు మంచంపై గౌతమి విగతాజీవిగా పడిఉండగా, యువకుడు కొనప్రాణంతో కొట్టుమిట్టాడుతున్నాడు. వెంటనే పోలీసులు ఘటనా స్థలం నుంచి యువతిని పోస్టుమార్టానికి తరలించగా లోకేశ్‌ను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.